అమ్మకంలో వరుడు

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయితే 30 లక్షల నుండి కోటి రూపాయిలు
ప్రభుత్వ ఉద్యోగి అయితే 50 లక్షల నుండి 5 కోట్ల రూపాయిలు

ఇది వరకట్నం పేరిట అనాదిగా ఆచారంగా వస్తూ, ఆ ఆచారం కాస్తా పెచ్చురిల్లి, ప్రస్తుతం రెండు కుటుంబాల మద్య ఒక అతి ఖరీదైన వ్యాపారంగా మారిన వైనం.

ఒక మంచి పెళ్లి సంబంధం కావాలంటే వధువు కుటుంబానికి భయం, ఎంత కట్నం అడుగుతారెమో అని.

రోజు రోజుకీ కట్నం తీసుకోవడంలో కూడా ఒక పోకడ కొనసాగుతుంది. ఒకతను 50 లక్షలు తీసుకుంటుంటే, ఇంకో అతను కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు, ఇవన్ని చూసి నేనెందుకు 2 కోట్లు తీసుకోకూడదు అనే అలోచన ఇంకొకరికి కలుగుతుంది. అసలు వరకట్నం అనేది తప్పు అని ఎవరికి అనిపించనంతలా సమాజంలో ఇమిడిపోయింది.

పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. అలాంటి పెళ్లి ఇరు కుటుంబాలకు మహోత్సవం అవ్వాలి. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వధువు కుటుంబానికి మాత్రం అదొక పెద్ద ఆర్థిక భారం. అదీ ప్రధానంగా వరకట్నం వల్ల.

వరకట్నం ఒక ఆచారమే అయ్యిండొచ్చు, కాని అది వధువు కుటుంబానికి ఎప్పుడైతే భారంగా మారిందో అదొక సాంఘీక దురాచారం కిందనే లెక్క. కొన్ని సందర్భాల్లో పెళ్లైన తర్వాత కూడా వరకట్నం పేరిట మహిళలను వేధించడం మనకు విదితమే.

వరకట్నం తీసుకోవడానికి మీరు చెప్పే కారణం నాకు తెలుసు. దానికి నేను కాదు చట్టమే పరిష్కారం చూపెట్టింది.

వారసత్వ చట్టం

దాని ప్రకారం అబ్బాయిలకి ఎలాగైతే తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందో, సరి సమానంగా అమ్మాయిలకు కూడా హక్కు ఉంటుంది.

వరకట్నం వద్దు అని అంటే అబ్బాయి తల్లిదండ్రులు తెలివిగా మీ అమ్మాయికి మీరెమిచ్చుకుంటారు అని అడిగే అవకాశమూ లేకపోలేదు. అప్పుడు మీరు చెప్పండి మీ అబ్బాయికి మీరెంత ఇచ్చుకోగలరో అంతే మేము ఇచ్చుకుంటామని.

తల్లిదండ్రులారా, అమ్మాయికి పెళ్లి చేసి భారం తగ్గించుకోవడం కాదు, అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడేంతగా చదివించి కుదిరితే ఉద్యోగం సంపాదించే వరకు నిరీక్షించి ఆ తర్వాత ఆమె పెళ్లి గూర్చి ఆలోచించండి.

చట్టం కల్పించిన ఆస్థి హక్కును సమానంగా పంచడమే కాదు, పెళ్ళైన జంటకు ఇరు కుటుంబాల బాధ్యతనూ అప్పగించండి.

Leave a comment