చాలా మంది “రాజకీయాలన్న, రాజకీయ నాయకులన్న నాకు నచ్చదు” అని అంటారు. దానికి కారణం రాజకీయంలో భాగంగా జరిగే కుట్రలు, కుతంత్రాలు, రౌడీయిజం, వ్యక్తిగత విమర్శలు, ఓట్ల కోసం డబ్బులు/లిక్కరు పంచడం, పార్టీ ఫిరాయింపులు, అవకాశవాదం, మొదలగునవి.

ఇవి కాదు రాజకీయాలంటే.
అసలు రాజకీయాలంటే సమస్యలు, వాటికి పరిష్కారాలు ఆలోచించడం, మరియు ఆ పరిష్కారాలకై పోరాడటం. అందుకోసమే మేధావులు “రాజకీయం అంటే ఒక పవిత్ర వ్యాసంగం” అని భావిస్తారు.
అసలు రాజకీయం అంటే చెడు అర్థం రావటానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థ. గెలుపే ప్రధానంగా జరిగే ఈ ఎన్నికలు, గెలవడానికి రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలే ప్రస్తుత రాజకీయ దుస్థితికి కారణం.
ఈ రాజకీయ దుస్థితిని నిర్మూలించడానికి క్రింద పేర్కొన్నట్టుగా అనేక పరిష్కారాలు ఉన్నాయి.
- ముఖ్యమంత్రిని ప్రత్యక్ష ఎన్నిక విధానంలో ఎన్నుకోవడం
- దామాషా ఎన్నిక విధానం
- అధికార వికేంద్రీకరణ
పై అంశాలను అర్థం చేసుకోవాలంటే లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి ఒక మంచి బలమైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవాలంటే చిత్త శుద్ధి కలిగిన రాజకీయ నాయకులు కావాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయాలను అంతిమంగా శాసించేది ప్రజలే. కాబట్టి, అలాంటి ప్రజల్ని చైతన్య పరచడం ఆ సమాజంలోని మేధావుల ప్రధాన కర్తవ్యం.

అందుకే మనమందరం చైతన్యమవుదాం, మన చుట్టూ ఉన్న వారిని చైతన్యపరుద్దాం.